సచిన్ పైలట్ ను అందుకే తప్పించారా..?

NAGARJUNA NAKKA

రాజస్థాన్ కాంగ్రెస్ లో సచిన్ పైలట్ అధ్యాయం ముగిసింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు స్టేట్ పార్టీ చీఫ్ నుంచి కూడా ఆయనను తప్పించారు. పైలట్ బీజేపీ కుట్రలో పావుగా మారారని కాంగ్రెస్ ఆరోపించింది. పైలట్ ను తొలగించాలన్న సీఎల్పీ తీర్మానంతో గవర్నర్ ను కలిసిన గెహ్లాట్.. బీజేపీ కుట్ర విఫలమైందని ప్రకటించారు. 

 

రాజస్థాన్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు సీఎల్పీ సమావేశం నిర్వహించిన కాంగ్రెస్.. సచిన్ పైలట్ ను పదవుల నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ పైలట్ తో పాటు ఆయన వర్గంలో ఉన్న ఇద్దరు మంత్రుల్ని, ఆయన వర్గానికి చెందిన రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడ్నీ కూడా పదవుల నుంచి తప్పించింది. దీని కోసం రెబల్స్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న సీఎల్పీ తీర్మానాన్ని ఉపయోగించుకుంది. పీసీసీ అధ్యక్షునిగా గోబింద్‌ సింగ్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. సచిన్ పైలట్‌తో పాటు సీఎల్పీ సమావేశానికి హాజరుకాని ఇద్దరు మంత్రులు రమేశ్ మీనా, విశ్వేంద్రసింగ్‌పైనా వేటు వేసింది. 

 

సీఎల్పీ సమావేశానికి హాజరయ్యేందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చినా పైలట్‌ నుంచి స్పందన రాకపోవడంతో చివరకు ఆయనను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో ఉన్న ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పార్టీ నిర్ణయించింది. సచిన్  పైలట్ బీజేపీ ట్రాప్ లో పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్.. బాధాతప్త హృదయంతో ఆయనపై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. 

 

సచిన్ పైలట్ సహా మరో ఇద్దరు మంత్రుల తొలగింపు తీర్మానం తీసుకుని రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం అశోక్ గెహ్లాట్.. గవర్నర్ కల్ రాజ్ మిశ్రను కలిశారు. సీఎం తీర్మానానికి గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. సర్కారును కూల్చడానికి బీజేపీ పన్నిన కుట్ర విఫలమైందని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ ఎపిసోడ్ లు  రాజస్థాన్ లో కూడా రిపీట్ చేయాలనుకున్నారని గెహ్లాట్ ఆరోపించారు. 

 

అటు తనను పదవుల నుంచి తొలగించారనే సమాచారం తెలియగానే సచిన్ పైలట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు. సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్ ఎమోజీని తొలగించారు. అటు ఏఐసీసీ ఆఫీస్ లో సచిన్ పైలట్ నేమ్ బోర్డ్ ను కూడా తొలగించారు. సచిన్ పైలట్ పై కాంగ్రెస్ వేటు వేయగానే బీజేపీ స్పందించింది. సచిన్ పైలట్ కు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ నేత ఓం ప్రకాష్ మాధుర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: