ఆన్ లైన్ చదువులు పిల్లలకు నష్టం చేస్తున్నాయా..... ఏం జరుగుతోందంటే?
దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో 14 కోట్ల మంది నిరుద్యోగులయ్యారని ఒక సర్వేలో తేలింది. ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంపై వైరస్ ప్రభావం భారీగా పడింది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా ఇప్పట్లో పాఠశాలలు ఓపెన్ కావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం కంటే జరుగుతున్న నష్టమే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ ల ద్వారా ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు ఫోన్లు, ట్యాబ్ లను గతంతో పోలిస్తే ఎక్కువ సమయం వినియోగిస్తున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు విద్యూర్థుల కోసం కొత్త మొబైల్, ట్యాబ్ లను కొనుగోలు చేసి వాళ్లకే ప్రత్యేకంగా ఇచ్చేశారు. అయితే వాళ్లు ఆన్ లైన్ క్లాసులు పూర్తయిన తరువాత గేమ్స్ ఆడటం, యూట్యూబ్ చూడటం, వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం చేస్తున్నారు. తాజాగా అమలాపురంలో ఒక విద్యార్థి ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ తీసుకుని ఐదున్నర లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్ కోసం ఆ డబ్బులను విద్యార్థి ఖర్చు పెట్టాడు.
బాలుడు డబ్బులు ఖర్చు చేసిన కొన్ని రోజుల తరువాత తల్లిదండ్రులు అకౌంట్ లో బ్యాలన్స్ చూసి షాక్ అయ్యారు. ఆ తరువాత విచారణ చేయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు పిల్లలకు ఫోన్లు ఇచ్చి నిర్లక్ష్యంగా ఉన్నారంటే మాత్రం బాధ పడాల్సి రావచ్చు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.