పవన్ అలా ఎందుకు చేయలేకపోతున్నారు ? అదేగా ఇప్పుడు చర్చ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, ఆ పార్టీ నాయకులను కట్టడి చేసే విషయంలోనూ, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడపించే విషయంలోనూ విఫలమవుతున్నారనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా పార్టీ ఓటమి చెందడంతో పాటు ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనవెంట మొదట్లో నడిచినా ఆ తరువాత ఆయన పార్టీని ధిక్కరిస్తూ, వైసీపీ అనుబంధ సభ్యుడిలా వ్యవహరిస్తూ వస్తున్నారు. పోనీ పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నారా అంటే, అదీ చేయడం లేదు. 

 

పార్టీ నిర్ణయాలను గౌరవిస్తున్నారా అంటే అది లేదు. ఈ సమయంలో ఆయనకు పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇచ్చి, సస్పెండ్ చేసే అవకాశం ఉన్నా, ఆ విధంగా పవన్ వ్యవహరించలేకపోతున్నారు. దీంతో జనసేన పైనే ఈ వ్యవహారంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితిని చూస్తే, ఆ పార్టీని విమర్శించడమే కాకుండా, ఆ పార్టీ నియమ నిబంధనలు పట్టించుకోకుండా,  బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో వైసీపీ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఆయనపై అనర్హత వేటు వేయించే విధంగా, ప్రయత్నాలు చేస్తోంది.

 


ఇదే పని జనసేన పార్టీ కూడా చేసే అవకాశం ఉన్నా, ఆ విధంగా పవన్ ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై అనర్హత వేటు పడినా, పాడకపోయినా క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదు అనే సంకేతాలు ఇచ్చే  అవకాశం ఉండేది.కానీ పవన్ ఆ విధంగా చేయలేకపోతున్నారు. రాపాక పవన్ పైన విమర్శలు చేసినా,  స్పందించలేని స్థితిలో ఒక పార్టీ అధినేత ఉండడంతో ముందు ముందు ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే అనుమానం రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: