కరోనా రోగులకు శుభవార్త... హోం ఐసోలేషన్ సురక్షితం అని చెబుతున్న వైద్యులు....?
దేశంలో, తెలుగురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో తక్కువ లక్షణాలు ఉన్న రోగులు హోం ఐసోలేషన్ కే పరిమితం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే హోం ఐసోలేషన్ పేరు వినగానే కొందరు కరోనా రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదిక కరోనా రోగులు హోం ఐసోలేషన్ కే పరిమితం కావడం మంచిదని చెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదట్లో కరోనా సోకిన రోగులకు ఆస్పత్రుల్లో ఐసోలేషన్, కుటుంబ సభ్యులకు క్వారంటైన్ కల్పించేవి. అయితే ప్రస్తుతం కరోనా బాధితుడి కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ లో, కరోనా రోగి హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులకు కరోనా కిట్లను అందజేస్తున్నారు.
అదే సమయంలో ఆహారం విషయంలో, ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగులెవరూ ప్రాణాలు కోల్పోవట్లేదని తెలుస్తోంది. ఆస్పత్రుల్లో మృతి చెందుతున్న కరోనా రోగులతో పోలిస్తే హోం ఐసోలేషన్ లో ఉండి మృతి చెందిన వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైందని సమాచారం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశాలమైన ఇల్లు ఉండి సరైన టాయిలెట్ సదుపాయాలు ఉంటే మాత్రమే హోం ఐసోలేషన్ కు అనుమతులు ఇస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు లేకపోతే మాత్రమే ఈ ప్రయోగాలకు అనుమతులు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకు కూడా హోం ఐసోలేషన్ కు అనుమతి ఇస్తున్నారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హోం ఐసోలేషన్ లో ఉండే కరోనా బాధితుల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉంది.