తినటం, తాగటం కాదు.. కరోనా నుండి తప్పించుకోవాలంటే ముందు ఆ పని చేయాలి..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. ఇక భారత్ లో కూడా ఈ ప్రపంచ మహమ్మారి పంజా విసురుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అదే సమయంలో అటు ప్రజల్లో కూడా కరోనా వైరస్ పై పూర్తిగా భయం పోయినట్టు కనిపిస్తుంది. దేశంలో అతి తక్కువ కేసులు ఉన్న సమయంలో.. ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి భయపడిన జనాలు.. ప్రస్తుతం లక్షల్లో కేసులు ఉన్నప్పటికీ యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్ కు వ్యాక్సిన్ రాకపోవడంతో ప్రస్తుతం అందరూ ఈ వైరస్ తో సహజీవనం చేసేందుకు సిద్ధపడుతున్న విషయం తెలిసిందే.
కాగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వైరస్ ను ఎదుర్కోవడం సులభం అంటూ వైద్య నిపుణులు చెబుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. అయితే పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటున్నారు కాని తగిన జాగ్రత్తలు మాత్రం ఎవరూ పాటించడం లేదు. అసలు నిపుణులు చెబుతున్నది ఏమిటి అంటే... కేవలం పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధక శక్తిని పెంచే పలు రకాల పానీయాలు తాగితే సరిపోదని.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ చెబుతున్నారు.
ఎందుకంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు పలు రకాల పానీయాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కానీ... పలు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా దరి చేరడం ఖాయం అన్నది నిపుణులు చెబుతున్న మాట. అయితే కొంతమంది అవగాహన లేమితో పౌష్టికాహారం తింటే చాలు కరోనా వైరస్ రాదు అనే భ్రమలో బతుకుతున్నారు. అయితే ప్రస్తుతం మనం తీసుకుంటున్న పౌష్టికాహారం కేవలం కరోనా వైరస్ వచ్చినప్పటికీ దానిని తట్టుకొని పోరాడేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని అంతేతప్ప కరోనా వైరస్ రాకుండా అడ్డుకోదు అన్నది ప్రస్తుతం నిపుణులు సూచిస్తున్నారు. అంతే కానీ ఇష్టమొచ్చినట్టుగా తిరిగి పౌష్టికాహారం తింటున్నాం కాబట్టి మాకు కరోనా రాదు అనుకుంటే మాత్రం ప్రాణాల మీదికి రావడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు.