జేసీ ఫ్యామిలీకి జగన్ చేసిన ఫేవర్ ఏంటి?
జేసీ ఫ్యామిలీ...అనంతపురం జిల్లాలో దశాబ్దాల తరబడి రాజకీయం చేస్తున్న కుటుంబం. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గం జేసీ ఫ్యామిలీ కంచుకోట. ఇక్కడ ప్రజలు పార్టీలకి అతీతంగా జేసీ ఫ్యామిలీని గెలిపించుకుంటారు. ఈ నియోజకవర్గం నుంచి జేసీ దివాకర్ రెడ్డి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవ్వడంతో దివాకర్, తమ్ముడు ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చేశారు.
2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే, ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి వీరు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలోకి దింపారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేయగా, అనంతపురం ఎంపీగా దివాకర్ తనయుడు పవన్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఈ ఇద్దరు జగన్ గాలిలో ఘోరంగా ఓడిపోయారు.ఇక తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ తొలిసారి ఓటమి రుచి చూసింది.
ఓటమి పాలైన దగ్గర నుంచి జేసీ ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి. జేసీ ఫ్యామిలీ గతంలో ట్రావెల్స్‌లోనూ, వాహనాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని అనేక కేసులు తెరపైకి వచ్చాయి. అయితే జగన్ ప్రభుత్వం కావాలనే మా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెడుతుందని జేసీ దివాకర్ అనేక సార్లు ఆరోపణలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడమని, ధైర్యంగా ఎదురుకుంటామని కూడా జేసీ సవాళ్ళు విసిరారు కూడా.
కానీ అనూహ్యంగా వాహనాల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ అరెస్ట్ కేవలం జగన్ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని జేసీ దివాకర్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. అయితే జగన్ ఇలా చేసి, జేసీ ఫ్యామిలీకి బాగానే ఫేవర్ చేస్తున్నారని అనంత తమ్ముళ్ళు అంటున్నారు. ఇలా చేయడం వల్లే తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ పుంజుకుందని, సానుభూతి పెరిగి అనంతపురం పార్లమెంట్ పరిధిలో కూడా పవన్ రెడ్డికి అడ్వాంటేజ్‌గా మారిందని చెబుతున్నారు.