కేరళ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు !

NAGARJUNA NAKKA

దేశంలో కరోనా కేసులు పది లక్షలు దాటిన తరుణంలో.. కేరళలో సామాజిక వ్యాప్తి మొదలైందన్న సీఎం విజయన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా 100 గంటల్లో పది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా ఉధృతి చూస్తుంటే.. ఇప్పుడిప్పుడే శాంతించే పరిస్థితులు కనిపించడం లేదు.


 
భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు రోజురోజుకీ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో  దేశవ్యాప్తంగా 34 వేల 884 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల 38 వేల 716కు చేరింది. వీరిలో 3 లక్షల 58 వేల 692  మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 6 లక్షల 53 వేల 750 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా  తగ్గింది. కొత్తగా మరో 671 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మృతుల సంఖ్య 26 వేల 273కు పెరిగింది. దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజు  3 లక్షల 61 వేల 24 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి 34 లక్షల 33 వేల 742 నమూనాల్ని పరీక్షించారు.

 

దేశంలో ఎక్కడా సామాజిక వ్యాప్తి మొదలుకాలేదని ఐసీఎంఆర్ చెబుతుంటే.. కేరళలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు ఆ రాష్ట్ర సీఎం విజయన్. రాజధాని తిరువనంతపురంలోని పలు చోట్ల కొవిడ్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని విజయన్‌ తెలిపారు. పూంథూరా, పుల్లువిలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి జరుగుతోందని తేలిందన్నారు. తీర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తామని కూడా ప్రకటించారు.

 

అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. గత 100 గంటల్లో 10 లక్షల కేసులు నమోదుకావడం  తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. చైనాలోని వుహాన్‌లో డిసెంబరు ఆఖర్లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచాన్ని  చుట్టుముట్టింది. జులై 13 నాటికి 1.30 కోట్ల  కేసులు నమోదుకాగా.. కేవలం నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య 1.4 కోట్లకు చేరడం కరోనా ఉద్ధృతికి  అద్దంపడుతోంది. 

 

అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య  నిధి హెచ్చరించింది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో మరోసారి షట్‌డౌన్‌ తప్పకపోవచ్చునని  పేర్కొంది. క్రమంగా విస్తరిస్తున్న పేదరికం, ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలు వంటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: