'కన్నా' కు పదవీ గండం ? ఆ లేఖపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు పదవీ గండం తప్పేలా కనిపించడం లేదు. మొదటి నుంచి ఆయన వైఖరి అనుమానాస్పదంగా ఉంటూ వస్తుండడం, కేంద్ర బీజేపీ పెద్దల అభిప్రాయం ఒక విధంగా ఉంటే, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ మరో అభిప్రాయంతో ఉంటూ వస్తుండడం, తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడి కన్నా ట్రాక్ తప్పుతున్నారనే అభిప్రాయంలో ఎప్పటి నుంచో బీజేపీ అధిష్టానం ఉంది. గతంలోనే కన్నా వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఏ విషయం పైన స్పందించవద్దని, కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే మాట్లాడాలని హెచ్చరించినా, కన్నా వైఖరిలో మార్పు కనిపించడం లేదనే అభిప్రాయంలో బీజేపీ అధిష్టానం వచ్చేసిందట.

 


 తాజాగా మూడు రాజధానుల బిల్లు కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాయడంపై బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ ట్రాప్ లోకి వెళ్లి ఈ విధంగా లేఖ రాశారని అనుమానం కేంద్ర బీజేపీ పెద్దల్లో వచ్చిందట. బిజెపి అధిష్టానం ఒక్కసారిగా ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో గవర్నర్ ను కలిసి ఈ విషయం పై వివరణ ఇవ్వాలని ఏపీ బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే, కన్నా ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తప్పించి ఆ స్థానంలో సమర్థవంతమైన నాయకుడిని, పూర్తిగా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులకు ఆ పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.


ఇక రాజధాని బిల్లు విషయానికి వస్తే, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి ఈ బిల్లు పెట్టి నెల రోజులు దాటిపోవడంతో నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు గవర్నర్ కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: