ఏం చేద్దామన్నా తంటానే.... క్లారిటీ మిస్ చేసుకున్న గంటా ?
ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు మాజీ మంత్రి, విశాఖ జిల్లా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు చూస్తేనే అర్ధం అవుతోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ లోనే ఉన్నా, ఆ పార్టీలో పూర్తిగా ఇమడలేకపోతున్నారు. అలా అని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అంటే అదీ చేయడం లేదు. ఇప్పటికే గంటా అరెస్ట్ తప్పదు అనే సంకేతాలు అధికార పార్టీ ఇస్తోంది. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అదేపనిగా గంటాకు సంబంధించిన వ్యవహారం తెరపైకి తెస్తూ, ఆయన అరెస్టు తప్పదు అనే విధంగా సంకేతాలు పంపిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు కూడా గంటాకు ఇబ్బందికరంగానే ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి.
టిడిపికి చెందిన నాయకులంతా వరుసగా జైలు బాట పడుతుండడం గంటా కు ఆందోళన కలిగిస్తోంది. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు వంటి వారు అరెస్ట్ అయిన గంటా శ్రీనివాసరావు వారిని కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ, ఇప్పటి వరకు పరామర్శించలేదు. అలాగే తన ప్రధాన అనుచరుడు నందకిషోర్ ను సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలోనూ ఘాటుగానే గంటా ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వం తన విషయంలో సీరియస్ గానే ఉందని అభిప్రాయంలో ఉన్న ఎప్పుడు తనను టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేయిస్తారో తెలియక పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు.
అలాగే వచ్చే ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా , వైసిపి ప్రభుత్వ దూకుడు చూస్తుంటే.. తనను అరెస్టు చేయించే వరకు ఊరుకునేలా కనిపించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది.ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా.. ఆ పార్టీలో ఉండలేక, వేరే పార్టీలో చేరే అవకాశంలేక పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇప్పుడు రాజకీయ ఉనికే ప్రశ్నర్ధకం చేసుకున్న గంటా రాజకీయ భవిష్యత్తు ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక అన్నట్టుగా తయారయ్యింది.