ఆనం నోరు కట్టేశారా...ఆయనే సైలెంట్ అయిపోయారా?

M N Amaleswara rao

ఆనం రాంనారాయణరెడ్డి దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలని శాసించిన నేత. మంత్రిగా రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్న నాయకుడు. ఆ విధంగా ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆనం ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభావం చూపలేని స్థాయికి దిగిపోయారు. 2019 ఎన్నికల ముందు టీడీపీని వదిలి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన ఆనం..వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

 

పైగా వైఎస్సార్‌సీపీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ జగన్...రాజకీయాల్లో ఆనం కంటే జూనియర్లు అయిన అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డిలకు కేబినెట్‌లో చోటు ఇచ్చారు. ఇక్కడ నుంచే ఆనం అసంతృప్తి మొదలైంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా ప్రతిపక్షం టీడీపీ మీద ఫైర్ అవుతుంటే, ఆనం మాత్రం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వచ్చారు.

 

నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని తన పార్టీకే చెందిన మంత్రి అనిల్‌కుమార్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని మాట్లాడారు. సొంత పార్టీ నేతలే ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని, నీళ్ళు అమ్ముకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత నెలలో వెంకటగిరి అభివృద్ధి పట్టించుకోవడం లేదని చెప్పి, అధికారులపై ఫైర్ అయ్యి మూడు రోజుల్లో పూర్తి వివరాలతో సమాచారం బయటపెడతా అని హెచ్చరించి ఆనం హడావిడి చేశారు.

 

అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆనం మూడు రోజుల్లో మీడియా సమావేశం పెడతానని చెప్పి నెలరోజులు దాటేసింది. ఇప్పటివరకు అడ్రెస్ లేరు. పార్టీ అధిష్టానమే ఆనం నోరు కట్టేసిందని నెల్లూరు రాజకీయాల్లో టాక్.  అధిష్టానం నుంచి ఆనంకు స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. పార్టీ గీత దాటితే వేటు తప్పదని చెప్పడంతో ఆనం సైలెంట్ అయిపోయి, నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: