తెలంగాణలో కరోనా విలయతాండవం... ఒక్కరోజే 1198 కేసులు....?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,198 కొత్త కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,274కు చేరింది. ఈ కేసులలో 11,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 422 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,885 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 34,323 మంది వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 510 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 106 కేసులు, మేడ్చల్ లో 76 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య తగ్గుతున్నా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,003 కరోనా శాంపిళ్లకు పరీక్షలు జరిగాయి. నిన్నటివరకు రాష్ట్రంలో 2,65,219 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.91 శాతంగా ఉండగా కరోనా రికవరీ రేటు 74 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,959 బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు నేడు హైకోర్టు కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా పరీక్షల తీరు, సమాచారం వెల్లడి గురించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని... ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం బులెటిన్, బెడ్ల విషయంలో ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెడుతోందని పేర్కొంది.