మరో 15 రోజుల్లో రష్యా వ్యాక్సిన్... కరోనా వైరస్ కట్టడి సాధ్యమే....?

Reddy P Rajasekhar

ప్రపంచదేశాల ప్రజలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో అర్థమయ్యేలా చేస్తున్నాయి. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా శరవేగంగా వైరస్ విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. 
 
అయితే ఇదే సమయంలో పలు దేశాల శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ విషయంలో శుభవార్తలు చెబుతూ వైరస్ ను త్వరలో కట్టడి చేయడం సాధ్యమేననే ఆశలను ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చినట్లు వెల్లడించగా తాజాగా రష్యా రక్షణ శాఖకు చెందిన ‘గమలీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ’ రూపొందించిన వ్యాక్సిన్ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. 
 
రష్యా దేశ ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురష్కో ఈ మేరకు ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ను నిబంధనలకు అనుగుణంగా, శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా కొందరు వాలంటీర్లపై ప్రయోగించామని సత్ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు. మూడో దశ ప్రయోగాలను ఆగస్టు 3న రష్యా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియాల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు విజయవంతం కావడంతో ఉత్పత్తికి సంబంధించిన చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. 
 
ఆగష్టు 3న క్లినికల్ ట్రయల్స్ నిర్వహణతో పాటు దేశీయ వినియోగం కోసం 3 కోట్ల డోసుల వ్యాక్సిన్లను, విదేశాలకు ఎగుమతికి 17 కోట్ల డోసులను రష్యా ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్‌ రూపకల్పనకు తాము ఉపయోగించిన పరిజ్ఞానానికి పేటెంట్‌ హక్కులు పొందామని... ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ అధిక సామర్థ్యంతో అది పనిచేస్తుందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఆగష్టు 3వ తేదీ నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి కానుండడం శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: