అమూల్ తో జగన్ సర్కార్ కీలక ఒప్పందం.... పాదయాత్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జగన్...?

Reddy P Rajasekhar

ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తోంది. అందులో భాగంగా జగన్ సర్కార్ నేడు అమూల్ తో కీలక అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఒప్పందం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ, అమూల్ మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రాత్మక అడుగు అని అన్నారు. ఏపీ పాల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళుతుండటంతో పాడి రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రంలో పాడి రైతులకు కష్టానికి తగిన ధరలు లభించడం లేదని అన్నారు. 2019 ఎన్నికలకు మునుపు పాదయాత్ర సమయంలో రైతులు లీటర్ మినరల్ వాటర్ ధర, లీటర్ పాల ధర ఒకేలా ఉందని తమ కష్టాలను చెప్పుకున్నారని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. లీటర్ మినరల్ వాటర్ బాటిల్ ధర 22రూపాయలుగా ఉంటే పాల ధర కూడా అంతే ఉందని చెప్పారు. టీడీపీ సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేసిందని విమర్శలు చేశారు. 
 
గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పోటీ వాతావరణం లేక పాడి రైతులు రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నామని పేర్కొన్నారు. సహకార రంగానికి, రైతులకు మేలు జరగాలని తమ ప్రభుత్వం ఆశిస్తోందని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావిస్తోంది. 
 
పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడి పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలని..... పాడి పరిశ్రమలో మహిళలకున్న అవకాశాలను పరిశీలించి వారిని ముందుకు నడిపించాలని భావిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: