అసోంలో వరదల విలయం.. సాయానికి ఐక్యరాజ్యసమితి సిద్ధం..!
బ్రహ్మపుత్ర మహోగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో మేఘాలయలో ఐదుగురు చనిపోగా, అసోంలో మరణాల సంఖ్య 87కు చేరింది. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో సెంట్రల్ వాటర్ కమిషన్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు... అసోం వరద బాధితులకు సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చింది.
బ్రహ్మపుత్ర మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఇతర నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అసోం, మేఘాలయల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. నీటి మునిగి కొందరు చనిపోతుంటే... కొండచరియలు విరిగిపడి ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
అసోంలోని 24 జిల్లాలోని 2 వేల 254 గ్రామాలు నీట మునిగాయి. లక్ష హెక్కార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వరదల వల్ల నిన్న మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఇంత వరకూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ల సంఖ్య 87కు చేరింది. వరదల వల్ల 70 లక్షల మందికి పైగా ఇబ్బందిపడుతున్నారని స్వయంగా సీఎం సర్బానంద సోనోవాల్ ప్రకటించారు.
వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అసోంకు సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చింది. భారత్ సాయం కోరితే సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ తెలిపారు.
మేఘాలయలో కూడా వరద బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా వెస్ట్‌గరో హిల్స్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని 195 గ్రామాలు నీట మునిగాయి. వరదల వల్ల లక్షన్నర మందికి పైగా ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల్లో ఇక్కడ నలుగురు పిల్లలు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మేఘాలయ సీఎం సంగ్మాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు కేంద్రం నుంచి సాధ్యమైన సాయం అందిస్తామని తెలిపారు అమిత్ షా.
వరదల వల్ల అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌తో పాటు టైగర్ రిజర్వ్ 90 శాతం నీట మునిగింది. దీంతో 143 వన్యప్రాణుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరదల వల్ల ఇంత వరకూ 116 వన్యప్రాణులు చనిపోయాయి. అందులో అరుదైన జాతికి చెందిన 9 ఖడ్గమృగాలు కూడా ఉన్నాయి.
అసోం, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో మరో రెండు-మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేస్తోంది. తర్వాత వానలు తగ్గుతాయని... చెబుతోంది. అప్పటి వరకూ బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తాయని అంచనా వేస్తోంది. దీంతో SOS అలర్ట్ జారీ చేసింది. దీని వల్ల ఆపదకాలంలో అత్యవసర సమాచారం అందుబాటులో ఉంటుంది. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని... నదులు ఒడ్డుకు ఎవరూ వెళ్లొద్దని సూచించింది. బీహార్ లోనూ వరదల బీభత్సం కొనసాగుతోంది. భాగమతి నది పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు నీటమునిగాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి.