తెలంగాణలో కరోనా విశ్వరూపం... భారీగా కరోనా కేసులు నమోదు....?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలలో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,567 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,000 మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50,826 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 447కు పెరిగింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 1,661 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 39,327కు చేరింది. ప్రస్తుతం 11,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 662 కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 3,22,326 కరోనా పరీక్షలు చేసినట్టు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో వచ్చే నాలుగు వారాలు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లోకల్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందని... అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారి మీడియాతో చెప్పారు.
కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇది విస్తరించిందని... ప్రజలు వైరస్ సోకకుందా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల గ్రేటర్ హైదరాబాద్ లో కేసులు కొంత తగ్గాయని.... కేసులు పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలలోకి వైరస్ విస్తృతంగా వెళ్లిందని.... తెలంగాణ జిల్లాలలో కూడ కొంత వ్యాపించిందని అన్నారు. ప్రజలు మాస్కులు పెట్టుకోవడం, వీలైనంతవరకు ఇంటికే పరిమితం కావడం , భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ భారీన పడకుండా కాపాడుకోవచ్చని చెప్పారు.