కేసీఆర్, కేటీఆర్ అసమర్థతోనే ఇదంతా.. స్వరం పెంచుతున్న రేవంత్ రెడ్డి..!
తెలంగాణలో కరోనా రెచ్చిపోతోంది. ప్రత్యేకించి హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో విజృంభిస్తోంది. మరోవైపు వైద్య సదుపాయాలు, పరీక్షలు వంటి విషయాల్లో కేసీఆర్ సర్కారు పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. దేశంలోనే తక్కువగా తెలంగాణలో పరీక్షలు చేస్తున్నారన్న అంశం బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ఇదే పని మీద ఉన్నారు. నిన్నమొన్నటి వరకూ సచివాలయం కూల్చివేత అంశంపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కరోనా పై దృష్టి సారించారు. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ కరోనా రోగి శవాన్ని వర్షంలోనే వదిలేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది.
దీన్ని ప్రస్తావిస్తూ ఇటీవల రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఓ ఘాటు పోస్టు పెట్టారు.. పొంకనాల పోశిగానికి మూడు ఎడ్లు ముప్పై ఆరు దొడ్లు..! అన్నట్టుంది తండ్రి కొడుకుల భాగోతం... కరోనాను ఎదుర్కోవడంలో గొప్పలు చెప్తున్నా ఆచరణ మాత్రం శూన్యం.. వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి లో వర్షానికి శవాన్ని వదిలేసిన వైనం. అంటూ వరంగల్ ఎంజీఎంలో వర్షంలో రోగి శవం పోటోను ట్యాగ్ చేశారు.
సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పెట్టిన కామెంట్లకు నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. అవసరమైతే మంత్రివర్గమంతా మాస్కులు కట్టుకుని ఫీల్డులో పనిచేస్తామంటూ కేసీఆర్ గతంలో చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.