అన్ లాక్ 2.0 : కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే పాటించాల్సిన మూడు సూత్రాలివే....?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే దాదాపు 8,000 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి మొదలైందని ప్రచారం జరుగుతోంది. సామూహిక వ్యాప్తి మొదలైతే ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి వైరస్ సోకిందో గుర్తించలేమని... తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ సోకకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 
వైరస్‌ పట్ల జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదని.... జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచనలు చేస్తున్నారు. వైరస్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లకు కరోనా సోకితే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 
 
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకకుండా మనల్ని కాపాడగలవని చెబుతున్నారు. 
 
కరోనా సోకితే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లడం కంటే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం మేలని కరోనాకు ప్రత్యేక చికిత్స లేకపోవడంతో లక్షణాలను బట్టి మందులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు సీజనల్‌గా వచ్చే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలతో పాటు స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తున్నాయి. కరోనా బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని.... తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: