విజయవాడలో లాక్ డౌన్ అంటూ జోరుగా ప్రచారం... నిజమేనా....?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో గత కొన్ని రోజుల నుంచి విజయవాడలో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలోని పటమట, కృష్ణ లంక, మొగల్రాజుపురం, విధ్యధరాపురం, అజిత్ సింగ్ నగర్, భవాని పురం, చుట్టుగుంట, సత్యనారాయణ పురం, చిట్టి నగర్ లలో అధికారులు ఆంక్షలు విధించారు.
కొన్ని రోజుల క్రితం విజయవాడలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా ఇప్పుడు మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో లాక్ డౌన్ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజయవాడలో లాక్‌డౌన్ వ్యవహారం గురించి స్పందించారు. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలుచేయనున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.
తప్పుడు వార్తలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని... విజయవాడలో ఎలాంటి లాక్‌డౌన్ లేదని.... ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచనలు చేశారు. గత నెలలో కూడా విజయవాడలో లాక్‌డౌన్ అంటూ ప్రచారం జరిగింది. కలెక్టర్ ఇంతియాజ్ మొదట లాక్ డౌన్ అమలు చేస్తామని ప్రకటన చేసి అనంతరం నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దీంతో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 7,998 మంది వైరస్ భారీన పడినట్టు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. నిన్నటివరకు రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్ ను పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 69,816కు చేరగా 884 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి.