మామ చెప్పిందే వేదంగా భావించే అల్లుడు హరీష్ రావు....?
తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(టీఆర్ఎస్)లో కీలక నాయకుడు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. 32 ఏళ్ల వయసులో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హరీష్ రావు అప్పటినుంచి బలమైన రాజకీయ నాయకునిగా ఎదుగుతూ వస్తున్నారు. మామ కేసీఆర్ లోని రాజకీయ లక్షణాలను అంది పుచ్చుకున్న హరీష్ రావు రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.
మామ డైరెక్షన్ లో క్షేత్రస్థాయిలో పనులను చక్కబెడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మామ చెప్పిందే వేదంగా భావించే హరీష్ రావు మామకు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో దాదాపు అదే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీకి తొలినాళ్ల నుంచి హరీష్ రావు అండదండగా ఉంటున్నారు.
కేసీఆర్ సలహాలు, సూచనలను పాటించి హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురే లేకుండా చేశారు. కొన్ని నెలల క్రితం మామకు అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయని... హరీష్ రావు బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడంతో వార్తలు ఆగిపోయాయి. ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే హరీష్ రావుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
అందరితో నవ్వుతూ కలగోలుపుగా మాట్లాడే హరీష్ రావు మాట తీరు ఎవరినైనా ఆకట్టుకుంటుంది. సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రజలకు ఏ పని కావాలన్నా హరీష్ రావు వెంటనే చేసి పెడతారనే మంచి పేరుంది. విద్యార్థి దశ పూర్తయిన వెంటనే హరీష్ రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు అందుకున్నారు. హరీష్ రావు అంటే సిద్దిపేట అనే రీతిలో ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందుతూ మామ తర్వాత పార్టీలో ఆ స్థాయి నేతగా ఎదిగారు.