విశాఖలో అసమ్మతి 'గంట' లు తప్పేలా లేదే ?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం మొదటి నుంచి అనేక చిక్కుముడులుగానే ఉంటూ వస్తోంది. ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారాలని చూసినా, ఆయన చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపడకపోవడంతో అయిష్టంగానే టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన దగ్గర నుంచి పార్టీలో ఉన్నా, లేనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అధికార పార్టీలో చేరేందుకు తరచుగా మంతనాలు చేస్తున్నా, జగన్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆగిపోతున్నారు. మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన చేసిన వెంటనే గంటా విశాఖను పరిపాలన రాజధానిగా అంగీకరిస్తున్నామని, ఈ విషయంలో జగన్ కే తన మద్దతు అంటూ ప్రకటన చేశారు. ఈ విషయంలో టిడిపి వ్యతిరేకించినా, గంటా మాత్రం జగన్ నిర్ణయానికి జై కొట్టాడు. ఇది ఇలా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గంటా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నా, విజయసాయిరెడ్డి ఆయన రాకను అడ్డుకుంటూ ఉండడంతో, ఎప్పటికప్పుడు ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తోంది.
కొద్దిరోజులుగా గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి అనేక అవినీతి ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి చేస్తూ వస్తున్నారు. దీంతో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోరు అనే అభిప్రాయానికి అంతా వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆయన ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల రామకృష్ణా రెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు ఆయన చేరికకు జగన్ వద్ద మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. గంటాను చేర్చుకోవడం ద్వారా విశాఖలో బలమైన పునాదులు వేసుకోవచ్చు అని, బలమైన సామాజిక వర్గం అండదండలు కూడా పార్టీకి కలిసొస్తాయని జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గంటా కనుక పార్టీలో చేరితే, భీమిలి, విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. కాకపోతే ఇప్పుడు గంటాను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో తమకు సరిగా ప్రాధాన్యం లేదని భావిస్తూ వస్తున్న విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇప్పుడు గంటా కనుక పార్టీలో చేరితే పూర్తిగా ఆయన కే అధిష్టానం అన్ని పదవులు కట్టబెట్టి ప్రాధాన్యం కల్పిస్తుంది అని, తమను పక్కన పెట్టేస్తారు అనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు కనుక చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు.