జగన్ కంచుకోటలో స్ట్రాంగ్‌ అవుతున్న టీడీపీ నేత..

M N Amaleswara rao

కర్నూలు జిల్లా జగన్‌కు కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 11 సీట్లు గెలుచుకుంటే, టీడీపీ మూడు చోట్ల విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

మొత్తం సీట్లు వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడ్డాయి. జిల్లాలోనే బడా బడా టీడీపీ నేతలంతా ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి పాలయ్యాక చాలామంది టీడీపీ నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ముఖ్యంగా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. అటు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబానిది కూడా అదే పరిస్థితి.

 

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ మాత్రం కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ ఆమె నియోజకవర్గంలో పూర్తిగా బలపడలేదు.  బనగానపల్లెలో మాత్రం టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి మాత్రం కాస్త స్ట్రాంగ్ అయినట్లు తెలుస్తోంది. జనార్ధన్ 2014 ఎన్నికల్లో బనగానపల్లె నుంచి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేసుకున్నారు.

 

కానీ 2019 ఎన్నికల్లో బీసీ జనార్ధన్ వైఎస్సార్‌సీపీ నేత కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ మెజారిటీలతో గెలిస్తే, కాటసాని మాత్రం 13 వేల ఓట్లతో జనార్ధన్‌పై గెలిచారు. ఎమ్మెల్యేగా కాటసాని పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచే పథకాల తప్ప, కొత్తగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు.

 

ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీసీ...నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. పైగా ఆయన గతంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇప్పటికీ కనబడుతోంది. ఇక లాక్ డౌన్ సమయంలో సొంత డబ్బులని సైతం ఖర్చు పెట్టి పేదలకు అండగా నిలిచారు. ఇక్కడ పార్టీ పరంగా కాకుండా బీసీ సొంత ఇమేజ్ పెంచుకుని దూసుకెళుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్‌కు కంచుకోటగా ఉన్న కర్నూలులో  టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి స్ట్రాంగ్ అవుతున్నారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: