ఏపీ ప్రజలకు శుభవార్త... ఇసుక విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం....?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొనుగోలుదారులు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న ఇసుక నాణ్యంగా లేని పక్షంలో దానిని తిప్పి పంపే అవకాశాన్ని ఇస్తున్నారు. రాష్ట్రంలో కొనుగోలుదారుల నుంచి నాణ్యత లేని ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోందని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ఈ మేరకు స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది.

 

ఈ మధ్య కాలంలో కొనుగోలుదారులు కొన్న ఇసుక మట్టితో కలిసి ఉండటంతో ఏం చేయాలో వాళ్లకు అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. నాణ్యత లేని ఇసుక ఇంటి నిర్మాణాలకు ఉపయోగపడటం లేదని కొనుగోలుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
గతంలో అధికార పార్టీ మంత్రులకు సైతం ఇవే తరహా అనుభవాలు ఎదురయ్యాయి. గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో ఇంటి నిర్మాణానికి మంత్రి పినిపే విశ్వరూప్ కు అధికారులు నాసిరకం ఇసుకను సరఫరా చేయడంతో ఈ వ్యవహారంపై ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇతర జిల్లాల్లో సైతం ఇవే తరహా ఫిర్యాదులు వస్తూ ఉండటంతో ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. 
 
మరోవైపు పలు జిల్లాల్లో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అధికారులు తవ్వితీసిన ఇసుక పరిమాణం, స్టాక్‌ పాయింట్లలోని నిల్వల లెక్క తేల్చడానికి డ్రోన్లతో సర్వే చేయించనున్నారు. ఇసుక తవ్వకాల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమికంగా ఇప్పటికే ఒకసారి ఆడిట్ జరగగా ఆ లెక్కలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారులు మరోసారి ఆడిట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: