మంత్రి బాలినేని స్టిక్కర్ ఉన్న కారు కేసులో కీలక మలుపు.... రంగంలోకి దిగిన ఈడీ....?
ఈ నెల 15వ తేదీన ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారు తమిళనాడులో భారీ నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బాలినేని స్టిక్కర్ ఉన్న వాహనంలో భారీగా నగదు పట్టుబడింది. అయితే తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు పోలీసులకు పట్టుబడిన రూ.5.27 కోట్ల నగదు తనదేనని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.
అయితే కారుపై స్టిక్కర్ ఉండటంతో టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికార పార్టీ నాయకుల అక్రమ సంపాదనే కారులో పట్టుబడిందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ నగదు గురించి ఫిర్యాదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది. కారులో పట్టుబడిన రూ. 5.27 కోట్ల రూపాయలపై ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. నిన్నటి నుంచి ఈడీ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభమైంది.
రామ్మోహన్ నాయుడు ఈడీని ఫిర్యాదులో మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ అంశం గురించి దర్యాప్తు చేయాలని కోరారు. ఏపీ రాజకీయాల్లో పట్టుబడిన నగదు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో పట్టుబడ్డ నగదు తనదేనని... తన డ్రైవర్ ఎమ్మెల్యే స్టిక్కర్ ను అతికించాడని.... ఆ నగదుకు పత్రాలు ఉన్నాయని వ్యాపారి నల్లమల్లి బాలు అన్నారు.
చెక్ పోస్టుల దగ్గర సులభంగా వెళ్లాలనే ఉద్దేశంతో డ్రైవర్ స్టిక్కర్ పెట్టి ఉండవచ్చని మీడియాకు తెలిపారు. మంత్రి స్వయంగా తనకూ ఆ నగదుకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించినా మంత్రి బాలినేని అనుచరుడే నల్లమల్లి బాలు అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. పట్టుబడిన నగదుతో అధికార పార్టీ నేతలకు సంబంధం ఉందని తెలిస్తే మాత్రం వాళ్లు చిక్కుల్లో పడినట్లేనని చెప్పవచ్చు.