కేసీఆర్ కు వరుస షాకులిస్తున్న హైకోర్టు... అధికారుల నిర్లక్ష్యమే కారణమా....?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల సీఎంలకు హైకోర్టులలో వరుస షాకులు తగులుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతుండగా తెలంగాణ హైకోర్టు కరోనా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ హైకోర్టు కరోనా విషయంలో చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని... హైకోర్టు అడిగిన అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కోరిన విధంగానే కరోనా కేసుల హెల్త్ బులెటిన్లను విడుదల చేస్తున్నా కోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చింది. కరోనా కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించింది.
గత నెల 8వ తేదీ నుంచి హైకోర్టు ఒక్క ఉత్తర్వును కూడా ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం కష్టమైన పక్షంలో ఎందుకు అమలు చేయడం సాధ్యం కావడం లేదో చెప్పాలని పేర్కొంది. నిన్న విడుదల చేసిన బులెటిన్లలో సరైన వివరాలను పొందుపరచలేదని అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు రేపు సీఎస్ ను అడిగి వివరాలను తెలుసుకుంటామని చెబుతూ... కరోనా కేసులన్నింటిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.
మొదట్లో కరోనా పరీక్షల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ప్రస్తుతం హెల్త్ బులెటిన్ల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే కరోనా విషయంలో ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. కరోనా విషయంలో హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది. సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల కరోనా విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తూ బులెటిన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.