ఆ లక్షణం ఉంటే కరోనానే... బెంగళూరు మేయర్ కీలక వ్యాఖ్యలు....?
గత ఐదు నెలల నుంచి దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలను మాత్రమే కరోనా లక్షణాలుగా శాస్త్రవేత్తలు గుర్తించగా తరువాత చేసిన పరిశోధనల్లో రుచి తెలియకపోయినా, వాసన గుర్తించలేకపోయినా కరోనానే అని శాస్త్రవేత్తలు ప్రకటన చేశారు.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన ఇతర లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కూడా గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో నగర మేయర్ గౌతమ్ కుమార్ షాపింగ్ మాల్స్‌లోకి వచ్చే వారికి టెంపరేచర్‌తో పాటు స్మెల్ టెస్ట్ కూడా చేయాలని సూచించారు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే వారికి కరోనా సోకినట్లే అని చెప్పారు.
మాల్స్‌లోకి వచ్చే వారు ఎవరైనా స్మెల్ టెస్ట్‌లో ఫెయిల్ అయితే వాళ్లను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. కరోనా సోకిన వాళ్లు రుచి, వాసనను గుర్తించలేరని కర్ణాటక ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రికి దీని గురించి లేఖ రాస్తానని తెలిపారు. షాపింగ్ మాల్స్ లో స్మెల్ టెస్ట్ ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఎంను కోరతానని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా రోగుల్లో జ్వరం, గొంతు నొప్పి లక్షణాలతో బాధ పడుతున్నట్లు కీలక ప్రకటన చేసింది.
కరోనా సోకిన వాళ్లలో రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని.... ఫ్లూ, ఇన్‌ఫ్లూఎంజా ఉన్నప్పుడు కూడా రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వ్యాధి ప్రారంభ దశలో ఈ లక్షణాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు.