వాహనదారులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్....?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కరోనా కష్ట కాలంలో వాహనదారులకు శుభవార్త చెప్పింది. మరోసారి రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు గడువు పొడిగించింది. సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్ కోసం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అయితే జగన్ సర్కార్ వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువును పొడిగించింది.
 
ప్రతిరోజూ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం... పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతూ ఉండటం వల్ల ఆటో, టాక్సీ న‌డుపుకునేవారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్ని నాని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు వరకు రోడ్డు ట్యాక్స్ గడువును పొడిగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
 
ప్రభుత్వం నుంచి ఈరోజు సాయంత్రం లేదా రేపు రోడ్డు ట్యాక్స్ గడువు పొడిగింపు గురించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో జగన్ సర్కార్ వెహికల్ ట్యాక్స్ చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ ను జులై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా వాహన ట్యాక్స్ ను అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో ట్యాక్స్ చెల్లించని వాళ్లు ఫైన్ తో సహా చెల్లించాలి.
 
వాహన ట్యాక్స్ కు వేసే ఫైన్ చెల్లించాల్సిన మొత్తం కంటే 50 నుంచి 200 శాతం అధికంగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వాహనదారులకు స్వల్ప ఊరట కలగనుంది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,167 కేసులు నమోదు కాగా 68 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 60,024 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,281 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: