భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలాధారం రామాయణం – సర్వాంగసుందరంగా అయోధ్య రామాలయం !

Seetha Sailaja
స్వాతంత్రానంతరం భారతదేశంలో రామరాజ్యం రావాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయిపోయినా రామరాజ్యం రాలేదు కాని ఎట్టకేలకు భారతీయ ఆత్మకు ప్రతీకగా ఈరోజు భారతదేశంలోని కోట్లాదిమంది హిందువుల కల రామాలయ స్వప్నం నెరవేరబోతోంది. దీపావళి వేడుకలను గుర్తు చేస్తూ దీపపు కాంతులలో ముగ్ధ మనోహరంగా ముస్తాబైన అయోధ్యలో ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా 40 కిలోల వెండి ఇటుకతో అయోధ్య రామాలయ శంఖుస్థాపన నేడు జరగబోతూ ఉండటంతో ప్రతి భారతీయుడు మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది.


కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వెండి పూజా సామాగ్రితో ఈ ఆలయ శంఖుస్థాపన జరగబోతోంది. ఈ శంఖుస్థాపన వార్తతో ఆనందంతో అమెరికాలోని భారతీయులు కూడ సంబరాలు జరుపుకుంటున్నారు అంటే ఈ అయోధ్య రామాలయ కల భారత ప్రజలను ఏవిధంగా ప్రభావితం చేసిందో అర్ధం అవుతోంది.


మూడు ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడుతున్న ఈ ఆలయంలో అంతటా రాతిని మాత్రమే ఉపయోగిస్తారు ఎక్కడ ఇనుము కనిపించదు. గత 30 సంవత్సరాలుగా అయోధ్య దగ్గర ఉన్న ‘కర సేవక్ పురంలో’ వేలాదిమంది కరసేవకులు 1.25 లక్షల ఘనపుటడుగుల రాతిని ఈ అయోధ్య రామమందిరం కోసం చెక్కే పనులలో నిమగ్నమై ఉన్నారు అంటే అయోధ్య రామమందిరం గురించి వారు ఎంత కలలు కంటున్నారు అన్నది అర్ధం అవుతుంది.


అయోధ్య రాముడి పేరిట ఈరోజు 1.25 లక్షల రఘుపతి లడ్డూలు అయోధ్య ప్రాంతంలో పంచిపెట్టబోతున్నారు. 300 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ ఆలయం నిర్మాణం పూర్తి అయితే భారతదేశంలోని చూడదగ్గ యాత్రా స్థలాలలో ఈ అయోధ్య కూడ ఒకటి కాబోతోంది. 27 నక్షత్రాల సూచికగా ఆలయంలో 27 మొక్కలు నాటబోతున్నారు. ఈ ఆలయ సందర్శనానికి వచ్చే భక్తులు తమ జన్మ నక్షత్ర రాశి అనుసరించి ఆ వృక్షాల క్రింద కూర్చుని కొన్ని క్షణాలు రామజపం చేస్తే మనం ఈ జన్మలో చేసిన పాపలు పోతాయని నమ్మకం. భారతీయ ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టుగా నిర్మించబోతున్న ఈ రామాలయం మానవ జీవన చైతన్యానికి ప్రతీక..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: