పాపం.. వైసీపీలోకి రాకముందే.. గంటాకు చుక్కలు చూపిస్తున్నారుగా...!?
అయితే గంటా వైసీపీలోకి రాడవం ఇష్టంలేని కొందరు అప్పుడే గంటాకు చుక్కలు చూపించడం ప్రారంభించారు. ఇంకా ఆయన పార్టీలో చేరకుండానే.. వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఆయన రాకకు వ్యతిరేకంగా ఏకంగా ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ ధర్నాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని చిన్నాపురం, తగరపు వలస, వీఎం పాలెం వద్ద గంటా శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
వైసీపీ అధిష్ఠానం తమ మనోభావాలు గుర్తించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. భీమిలి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇక గంటాకు పాత మిత్రుడు మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన అసంతృప్తిని నేరుగా మీడియా ముందే ప్రకటించేస్తున్నారు. కేసుల మాఫీ కోసమే గంటా వైసీపీలోకి వచ్చేందుకు తాపత్రయపడుతున్నారని అవంతి శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం మీడియా ముందు కామెంట్ చేశారు.
అయితే ఈ తరహా ఆందోళనలను వైసీపీ అధిష్టానం పట్టించుకుంటుందా అంటే కష్టమే. వైసీపీ అధినేత జగన్ నిజంగా గంటా చేరికతో లాభం ఉందనుకుంటే.. పార్టీలో చేర్చేసుకుంటారు. అందులోనూ కోరి వచ్చేవారిని.. ఓ ఎమ్మెల్యేని ఎవరు మాత్రం వద్దంటారు. దీని ద్వారా టీడీపీ బలం ఇంకాస్త తగ్గుతుంది కదా.