తెలంగాణ వాసులకు శుభవార్త... ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ...?

Reddy P Rajasekhar
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 2000కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ కేసులు పెరుగుతుండటంతో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.
 
కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీల ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి కరోనా అనుమానితులను గుర్తించి ర్యాపిడ్ యాంటిజెన్‌ పరీక్షలు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు అందాయి. సీఎం నుంచి అనుమతులు వచ్చిన తరువాత కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీల ద్వారా అధికారులు ప్రజల ముంగిటకే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.
 
గ్రేటర్ హైదరాబాద్ లో ‘వెర’ స్మార్ట్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్ ఇంటెలిజెన్స్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ క్వారంటైన్‌ (ఐ–మాస్క్‌) టెక్నాలజీ ద్వారా వోల్వో బస్సుల్లో కరోనా లేబరేటరీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ సైతం వోల్వో బస్సుల ద్వారా ఒకేసారి పది మందికి కరోనా పరీక్షలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు బస్సుల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడుస్తున్న బస్సుల్లో రోజుకు 300 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 100 వోల్వో బస్సులను అందుబాటులోకి తీసుకొనివస్తే రోజుకు 30,000 కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో నిన్న ఒక్కరోజే 2207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 75,257కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,66,984 కరోనా పరీక్షలు చేయగా 601 మంది మృతి చెందారు.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: