అక్క పెళ్లి.. సంతోషంగా షాపింగ్ వెళ్లి.. అటునుండి అటే..?
వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాల్వ పల్లి గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరి వివాహం ఈ నెల 13న జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. పెళ్లి పనుల్లో అటు ఇరు కుటుంబాలు కూడా ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. అక్క పెళ్లి పనులు మొత్తం దగ్గరుండి చేస్తున్నాడు వెంకటాద్రి. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూన్నాడు . ఇక అక్క పెళ్లి కి కొత్త దుస్తులు కనుక్కోవాలి అనుకున్నాడు వెంకటాద్రి, ఈ క్రమంలోనే తన బంధువుతో కలిసి బైక్ పై షాపింగ్ కి వెళ్ళాడు.
కానీ అలా వెళ్లడమే అతని పాలిట మృత్యువు గా మారుతుంది అని ఊహించలేకపోయాడు వెంకటాద్రి. షాపింగ్ పూర్తి చేసుకుని బైక్ పై ఇంటికి వెళుతుండగా... ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటాద్రి తలకు బలమైన గాయం అయ్యింది. బంధువు ప్రశాంత్ కూడా తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే అంబులెన్సు కి సమాచారం అందించి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వెంకటాద్రి మృతిచెందారు. బందువు ప్రశాంత్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటాద్రి మృతితో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నిండిపోయింది.