మానవత్వం చాటుకున్న కేరళ ప్రజలు..!
ఐతే శుక్రవారం రాత్రి సంఘటనా స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు అందరినీ కలిచి వేశాయి. రక్తం ఏరులై పారుతున్న ప్రయాణికులను కేరళ అంబులెన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా... ఆ దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. అయితే కేరళకు చెందిన చాలామంది సామాన్య ప్రజలు ఎయిర్ ఇండియా దుర్ఘటనలో గాయాలపాలైన ప్రయాణికులకు రక్తదానం చేసేందుకు, వారి కోసం ఆహారం ప్రిపేర్ చేసేందుకు, ఆహార పొట్లాలు అందజేసేందుకు వందల సంఖ్యలో తరలివచ్చారు. నిజానికి నిన్న రాత్రి, ఈరోజు ఉదయం కూడా కేరళ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తోంది. కానీ ఆ భారీ వర్షాన్ని గాని, కరోనా వైరస్ ని గాని లెక్కచేయకుండా చాలామంది ప్రజలు గాయపడ్డ వారికి సహాయం చేసేందుకు తరలిరావడం నిజంగా అభినందనీయం.
ప్రస్తుతం 112 మంది తీవ్ర గాయాలతో మలప్పురం జిల్లాలోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వందేమాతరం ప్రోగ్రాం లో భాగంగా పలు విమానాలన్నీ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నాయి. బోయింగ్ 737 దుబాయ్ లోని భారతీయులని కేరళ రాష్ట్రానికి తరలించగా.. గమ్యస్థానానికి చేరుకోగానే ఈ ఘటన జరగడం చాలా విషాదకరం. కొజికోడ్ బ్లడ్ బ్యాంకుల ముందు రక్తదానం చేసేందుకు కేరళ ప్రజలు క్యూలో నిల్చోవడం ప్రస్తుతం అందరి ప్రశంసలకు కారణమవుతుంది.