అదృష్టం లేని ఆ నేతకు జగన్ దారి చూపిస్తారా?

M N Amaleswara rao
రాజకీయాల్లో అవకాశంతో పాటు అదృష్టం ఉంటే ఆ నాయకులకు తిరుగుండదు. అయితే కొందరు నాయకులకు అవకాశం దక్కినా...అదృష్టం ఉండదు. ఇక దాని వల్ల వారు రాజకీయాల్లో క్లిక్ కాలేరు. అలా రాజకీయాల్లో విఫలమవుతూ వస్తున్న నేతల్లో చలమలశెట్టి సునీల్ ముందు వరుసలో ఉంటారు. సునీల్‌కు రాజకీయంగా చాలానే అవకాశాలు దక్కాయి గానీ అదృష్టం మాత్రం దక్కలేదు. దాని వల్ల గెలుపు అంచుల వరకు వచ్చి ఎప్పుడు బోల్తా కొడుతూనే ఉన్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన సునీల్..ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేవలం 34 వేల ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. ఇక తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడం, జగన్ కొత్తగా వైసీపీ పెట్టడంతో అందులోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ పార్లమెంట్ బరిలో దిగారు.

అప్పుడు కూడా సునీల్‌ని దురదృష్టం వెంటాడింది. దాదాపు 3 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక సునీల్ రాజకీయాలకు కాస్త దూరంగా జరిగి...మళ్ళీ 2019 ఎన్నికల ముందు బయటకొచ్చారు. అయితే అప్పుడు రాష్ట్రమంతా జగన్ వేవ్ కనబడుతున్నా సరే, సునీల్ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు.

అయితే టీడీపీలోకి వచ్చి మళ్ళీ 2019 ఎన్నికల్లో అదే కాకినాడ నుంచి పోటీ చేసి కేవలం 25 వేల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఒకవేళ సునీల్ వైసీపీలో ఉండుంటే సులువుగా గెలిచేసేవారు. ఓడిపోయాక సైలెంట్ అయిన సునీల్ మళ్ళీ ఇప్పుడు వైసీపీ వైపుకు వచ్చేస్తున్నారు. ఇక సునీల్‌కు జగన్ మంచి దారి చూపించే అవకాశముందని తెలుస్తోంది. 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్‌కు అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ రాజ్యసభ కుదరకపోయినా వీలుని బట్టి ఏదొక పదవి అయిన ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ఈ సారైన సునీల్‌కు లక్ చిక్కుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: