కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే వాళ్లకు షాకింగ్ న్యూస్...?
ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెట్టిన వెంటనే ముందు సీటీ స్కాన్ తీయించుకోవాలని ఆ తర్వాతే వైద్యులను కలవాలని ఆస్పత్రి సిబ్బంది రోగులకు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే తంతు నడుస్తోంది. ఎవరైనా సీటీ స్కాన్ చేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదని చెబుతూ సీటీ స్కాన్ కోసం 8,000 రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
సీటీ స్కాన్ రిపోర్టులు వచ్చిన తరువాత పరీక్షలు చేయించుకున్న వారిది కరోనా అనుమానిత కేసు అని చెప్పి ఆర్టీ పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేస్తున్నారు. మొదట సీటీ స్కాన్ చేయించుకోమని చెప్పి ఆ తర్వాత ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఎందుకు చేయించుకోవాలని చెబుతున్నారో అర్థం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ ద్వారా కరోనా నిర్ధారిస్తామని చెబితే అక్కడ చేయించుకోకుండా సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిది.
ప్రభుత్వం కరోనా వైరస్ సోకిందో లేదో గుర్తించడానికి ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను మాత్రమే సూచిస్తోంది. సీటీ స్కాన్ అందరికీ అవసరం లేదని సీటీ స్కాన్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చి కరోనా తీవ్ర లక్షణాలు ఉంటే మాత్రమే సీటీ స్కాన్ ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ సీటీ స్కాన్ చేయించుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది చెప్పడం సరికాదని అభిప్రాయపడుతున్నారు