కరోనా గురించి వెలుగులోకి కొత్త విషయాలు.... వైరస్ కనుమరుగైపోతుందని చెబుతున్న శాస్త్రవేత్తలు...?

Reddy P Rajasekhar
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ గుట్టు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో అనేక కొత్త విషయాలు వైరస్ గురించి వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్తలు కనిపిస్తున్న అన్ని లక్షణాలకు వైరస్ కారణం కాదని తేల్చారు.
 
సీసీఎంబీ ప్రతినిధి డాక్టర్‌ సోమదత్తా మాట్లాడుతూ 40 మంది కరోనా రోగుల జన్యువులపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించినట్లు చెప్పారు. కరోనా సోకిన వారందరిలో ఒకే తరహా లక్షణాలు కనిపించడం లేదని... వైరస్‌ అందరిపైన ఒకే విధమైన ప్రభావం చూపకపోవడం ఒక కారణం కాగా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల జన్యువులు లక్షణాలు కనిపించడం లేదా కనిపించకపోవడానికి కారణమవుతాయని తెలిపారు.
 
సీసీఎంబీ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ విజృంభణ మొదలైన తర్వాత వైరస్ దాని జన్యు పటాలను సేకరించి విశ్లేషించడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దానిలో ఎటువంటి మార్పులు జరగడం లేదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇన్ఫెక్షన్‌తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘ఎల్‌’ రకం నెమ్మదిగా కనుమరుగవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మైక్రోబయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. 48,653 మంది నుంచి సేకరించిన కరోనా జన్యువులను విశ్లేషించినట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు వైరస్ కనుమరుగైతే కరోనా వైరస్ ను జయించడానికి ఇంకెంతో కాలం పట్టదనే చెప్పాలి. గతేడాది డిసెంబర్ నెలలో ఎల్ రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చించి. ఆ తర్వాత వైరస్ ఎస్‌, జీ, వీ రకాలుగా మారాయి. శాస్త్రవేత్తలు వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకినప్పుడు దానిలో కొన్ని జన్యుపరమైన మార్పులు వస్తాయని.... ఇవి ఎక్కువగా ఉంటే వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం కష్టమవుతుందని... కరోనా వైర్స్ ‌ పనితీరులో పెద్దగా మార్పులు లేవు కాబట్టి వ్యాక్సిన్ తయారు చేయడం సులువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: