తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు !
హైదరాబాద్ గత రెండు రోజులుగా వర్షంలో నానుతోంది. కురుస్తోంది ఓ మోస్తరు వర్షమే.. అయినప్పటికీ క్రమం తప్పకుండా పడుతుండే సరికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కార్వాన్, జియాగూడలోని పలు ప్రాంతాల్లో నీరు చేరింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, లక్డీకాపూల్, పంజాగుట్టలలో చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉండటంతో.. ఆఫీసులకు వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్నవరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇక ఇల్లెందు , భద్రాచలం నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి. మరోవైపు కిన్నెరాసాని డ్యాంను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి. చెరువులన్నీ నిండిపోవడంతో.. ఇన్నాళ్లు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ఏజెన్సీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పంటపొలాలన్ని నీటమునిగి సెలయేరును తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేని వర్షాలకు అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి ఏజెన్సీలో జోరువానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పలపాడు వాగు పొంగడంతో ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం జల్లేరు వాగు కూడా పొంగడంతో సుమారు 19 గిరిజన గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. నాలుగు రోజులు తీరప్రాంతం అలజడిగా ఉంటుందని సూచించింది. తెలంగాణలోనూ అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణశాఖ.