ఆ వ్యాక్సిన్ తో కరోనా నుంచి మెరుగైన రక్షణ... యువతలో వైరస్ కు చెక్...?
తాజాగా ఇజ్రయెల్ శాస్త్రవేత్తలు క్షయ వ్యాధి వ్యాక్సిన్ ను తీసుకున్న వారిలో కరోనా నుంచి మెరుగైన రక్షణ కనిపిస్తోందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ వల్ల యువతకు భారీగా ప్రయోజనం కలుగుతోందని... యువతలో వైరస్ కు చెక్ పెట్టేందుకు టీబీ వ్యాక్సిన్ దోహదపడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. హీబ్రూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, బెన్ గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.
కొన్ని దేశాలు మాత్రమే ఈ వ్యాక్సిన్ ను ఇస్తున్నాయని.... చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ ను ఇవ్వడం ఆపివేశాయని శాస్త్రవేత్తలు తెలిపారు. టీబీ వ్యాక్సిన్ కరోనాపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 55 దేశాలకు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్యను తగ్గించడంలో వ్యాక్సిన్ సహాయపడినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
గత 15 సంవత్సరాలలో ఈ వ్యాక్సిన్ ను తీసుకున్న 24 సంవత్సరాల లోపు వాళ్లకు వ్యాక్సిన్ చాలా ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ ను పొందిన పెద్ద వయస్సు వారిపై మాత్రం వ్యాక్సిన్ ప్రభావం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. కరోనాపై ఈ వ్యాక్సిన్ ఎందుకు ప్రభావం చూపుతుందనే విషయాల గురించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ విడుదల కావడంతో ఇతర వ్యాక్సిన్లను కూడా వేగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి మార్కెట్లోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.