కరోనా సోకితే 50 వేల రూపాయలు క్యాష్ బ్యాక్... షోరూం వింత ఆఫర్...?

Reddy P Rajasekhar
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ అంచనాలను మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ధాటికి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. నిత్యావసరాలు మినహా అనవసర ఖర్చుల జోలికి వెళ్లడం లేదు. ఒకప్పుడు షాపింగ్‌ల కోసం ఎగబడిన జనం ఆన్ లైన్ లోనే అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
 
షాపింగ్ కు వెళ్లామంటే కరోనా బారిన పడతామని ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన షాపింగ్ కాంప్లెక్స్ లు ప్రస్తుతం చాలా తక్కువ మంది కస్టమర్లతో సరిపెట్టుకుంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమ్మే షోరూంలది సైతం ఇదే పరిస్థితి. దీంతో షోరూం నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో వింత ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తాజాగా కేరళలో ఒక ఎలక్ట్రానిక్ షోరూం వింత ఆఫర్ ను ప్రకటించగా ఆ ప్రకటన వివాదాస్పదమైంది.
 
"మా దగ్గర షాపింగుకొచ్చిన కస్టమర్లు 24 గంటల్లో కరోనా బారిన పడితే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తా"మని ఎలక్ట్రానిక్ షోరూం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో సంస్థ ప్రకటనలు గుప్పించింది. కొట్టాయం జిల్లా మున్సిపాలిటీ కౌన్సిలర్, లాయర్ బిను పులిక్కక్కందం ప్రకటన చట్ట వ్యతిరేకం, శిక్షార్హమని భావించాడు.
 
క్యాష్ బ్యాక్ కోసం ఆశ పడి కరొనా సోకిన వ్యక్తులు ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి ఈ షోరూంకు వెళ్లే ప్రమాదం ఉందంటూ కేరళ సీఎంకు పిటిషన్ అందజేశాడు. ఎవరైనా డబ్బు కోసం ఆశపడి కరోనాను కొని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదని లాయర్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ షోరూం ప్రకటన వివాదాస్పదం కావడంతో పోలీసులు దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేసి కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నారు. మరోవైపు కేరళలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: