బంగారం కొనాలా..? వద్దా..?

NAGARJUNA NAKKA
మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే కోవిడ్ సమయంలో అన్ని రకాల పెట్టుబడి సాధనాలు కుదేలు కావడంతో.. పసిడి జోరుకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఓ దశలో బంగారం 80 వేలకు చేరుతుందనే అంచనాలు కూడా వెలువడ్డాయి. అయితే గత వారం నేల చూపులు చూసిన కనకం.. మళ్లీ పుంజుకుంటోంది. బంగారం ధరల్లో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మదుపర్లను అయోమయంలోకి నెడుతున్నాయి.
కోవిడ్ టైమ్ లో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చతికిలపడ్డాయి. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ కూడా నిలిపేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉంది. ధనిక దేశాల వృద్ధిరేటు కూడా దారుణంగా పడిపోయింది. దీంతో పెట్టుబడులు పెట్టాలంటే మదుపర్లు సందేహించే పరిస్థితి వచ్చింది. అటు క్రూడాయిల్ ధరల్లో కూడా అనిశ్చితి ఉండటంతో.. అందరూ బంగారం వైపు మొగ్గుచూపారు. గతంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు మెరుగైన ప్రతిఫలం ఇచ్చిన చరిత్ర పసిడికి ఉండటంతో.. అందరూ గోల్డ్ ఈజ్ గోల్డ్ అని.. భారీగా బాండ్లు కొనుగోలు చేశారు.
అందరూ బంగారంపై పెట్టుబడి పెట్టడంతో.. పసిడి పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్లపై ప్రయోగాలు ఆశాజనకంగా ఉండటంతో.. గత వారం బంగారం దూకుడుకు కళ్లెం పడింది. దీనికి తోడు డిమాండ్ తగ్గడంతో.. కొనుగోళ్లు కూడా మందగించాయి. దీంతో వివిధ దేశాల పసిడి దిగుమతులు కూడా పడిపోయాయి. ఇవన్నీ కలిసొచ్చి బంగారం ధరను తగ్గించాయి. కానీ మళ్లీ ఈ వారం నుంచీ బంగారం ధరలు స్వల్పంగా పెరగడం మొదలుపెట్టాయి. దీంతో బంగారం కొనాలా.. వద్దా అనే మీమాంస మళ్లీ మొదలైంది.
గత కొంతకాలంగా బంగారం వినియోగం తగ్గుతోంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కూడా ఆభరణాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కానీ అనూహ్యంగా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. వినియోగం బాగా తగ్గినా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దానికి కారణం ఇప్పుడు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూడటమే. గత కొద్ది వారాలుగా టాప్ 5 ఇన్వెస్ట్ మెంట్లలో ఒకటి బంగారంగా మారింది. షేర్ మార్కెట్ కంటే కూడా బంగారాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు జనాలు..  కాయిన్స్‌‌, బిస్కట్స్ రూపంలో బంగారం కొనడం పెరిగిందని అంటున్నారు.
వరల్డ్‌‌ గోల్డ్‌‌ కౌన్సిల్‌‌ అంచనా ప్రకారం భవిష్యత్తులో జనం బంగారం కొనుగోళ్లపై భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద బంగారాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ గా కాకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా చూస్తే.. లాభమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: