మీడియా మంటలు: NTV, TV5 ఛానళ్ల మధ్య ప్రోమోల యుద్ధం.. భలే బయటపెట్టేసుకున్నారుగా..?
ఫలానా టీవీ చానల్ యజమాని అక్రమాలు అంటూ పేరు చెప్పకుండానే ఎన్టీవీ ప్రోమో ప్రసారం చేసింది. అయితే అలాంటి ఆరోపణలు సదరు టీవీపై ఎప్పటి నుంచో ఉన్నవే.. అయితే అది మీడియా సర్కిళ్లోనే కానీ జనానికి తెలియదు కదా. అందుకే అది కాస్తా సంచలనం అయ్యింది. ఏ ఛానల్ యజమాని.. ఏంటా అక్రమాలు ఏంటో చూద్దాం కదా అని జనం కాస్త ఉత్సాహపడ్డారు. అయితే తనపై ప్రోమో వేస్తే ఏ టీవీ ఛానల్ యజమాని అయినా ఊరుకుంటాడా.. ? అందులోనూ అతని చేతిలో కూడా ఓ ఛానల్ ఉంది కదా..
దీంతో టీవీ5 లోనూ ఎన్టీవీ యజమాని అక్రమాలపై ప్రోమో వచ్చేసింది. సేమ్ ఇదీ అలాగే పేరు చెప్పకుండానే.. దీంతో ఆహా.. ఈ రెండు ఛానళ్లు వీధిన పడి కొట్టుకుంటున్నాయి.. ఒకరి బండారం మరొకరు బయటపెట్టుకుంటున్నారు కదా.. చూద్దాం అని ప్రేక్షకులు భలే ఉత్సాహపడ్డారు.. కానీ.. ఇంతలో ఏమైందో ఏమో.. ఎక్కడ లోపాయకారీగా రెండు ఛానళ్ల యజమానుల మధ్య ఒప్పందం కుదిరిందో ఏమో కానీ.. ఉన్నపళంగా రెండు ఛానళ్లూ ప్రోమోలు ఆపేశాయి.
అప్పటి వరకూ వేసిన ప్రోమోల్లో స్టోరీ ఎప్పుడు వేస్తామో చెప్పలేదు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే ఇక ఆ రెండు ఛానళ్లలో వేసిన ప్రోమోల తాలూకు కథనాలు ఆగిపోయినట్టే అన్నమాట. అయితే ఆ రెండు ఛానళ్లలో స్టోరీలు టెలికాస్ట్ కాకపోయినా.. మొత్తానికి ఇద్దరు టీవీ యజమానులూ అంత పత్తిత్తులేం కాదని.. ఇద్దరికీ అక్రమాలు ఉన్నాయని జనానికి అర్థమైపోయింది.