తెలంగాణ విద్యార్థుల ఆన్ లైన్ క్లాసులకు కొత్త మార్గదర్శకాలు...?
వారానికి మూడు రోజులు మాత్రమే నర్సరీ, ఎల్.కే.జీ, యూ.కే.జీ విద్యార్థులకు బోధించాలని పేర్కొంది. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజుకు గంటన్నర పాటు రెండు క్లాసులు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రోజుకు 2 గంటల పాటు మూడు క్లాసులు బోధించాలని తెలిపింది. 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు 3 గంటల చొప్పున నాలుగు క్లాసులు బోధించాలని పేర్కొంది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కళాశాలల్లో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఈ నెల 27వ తేదీ నుంచి అధ్యాపకులంతా విద్యా సంస్థలకు హాజరుకావాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల విషయంలో మాత్రం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేయడంతో సెప్టెంబరు 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం జూన్ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలు ఈ సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. దీంతో సిలబస్ లో కూడా మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. డిజిటల్ తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.