రామ్మోహన్ క్లారిటీ ఇచ్చేసినట్లేగా...

M N Amaleswara rao
“అచ్చెన్నాయుడు జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి కింజరాపు ఫ్యామిలీని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. దీంతో రామ్మోహన్ నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన బాబాయ్ కోసం రామ్మోహన్ బీజేపీలోకి వెళ్లబోతున్నారు. త్వరలోనే ఆయన టీడీపీని వీడుతున్నారు” అంటూ ఏపీ రాజకీయాల్లో లేనిపోని ప్రచారం జరిగింది. కానీ అదంతా ప్రచారానికి పరిమితమని తేలిపోయింది.

తాజాగా ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా వచ్చిన నేపథ్యంలో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక బెయిల్ వచ్చిన వెంటనే రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ, కింజ‌రాపు అభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయని, ఈ క‌ష్ట‌కాలంలో మా కుటుంబానికి అండ‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు, టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లంద‌రికీ శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నానని ఓ స్టేట్‌మెంట్ వదిలారు.

దీంతో రామ్మోహన్ పార్టీ మార్పు అని ప్రచారం చేస్తున్న వారందరికీ ఒక్కసారిగా గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. అసలు మొదట నుంచి కింజరాపు ఫ్యామిలీ టీడీపీకి వీర విధేయులుగా ఉంటూ వస్తున్నారు. దివంగత ఎర్రన్నాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేస్తూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అలాగే ఎంపీగా పార్లమెంట్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. తన వాక్చాతుర్యంతో ఢిల్లీ పెద్దలని సైతం మెప్పించారు.

ఇక ఎర్రన్న మరణంతో ఆయన సోదరుడు అచ్చెన్న, రామ్మోహన్‌లు టీడీపీలో కీలకంగా మారారు. బాబుకు విధేయులుగా నడుచుకున్నారు. అచ్చెన్న అయితే బాబు చేసే ప్రతి పోరాటానికి అండగా ఉంటూ, ఆయనకు కుడి భుజంగా నడుచుకున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పిల్లర్ మాదిరిగా నిలబడుతున్నారు. అయితే అచ్చెన్న జైలుకు వెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

జిల్లాలో పార్టీకి బలం తగ్గినట్లైంది. అదే సమయంలో రామ్మోహన్ కూడా కాస్త సైలెంట్‌గా ఉండటంతో కింజరాపు ఫ్యామిలీ బాబుకు షాక్ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాము ఎప్పుడు బాబుకు విధేయులమే అని రామ్మోహన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఇక అచ్చెన్నకు కరోనా తగ్గాక ఏపీ రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: