తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జాగ్రత్తలు..!

NAGARJUNA NAKKA
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్నాయి. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా ఈ సమావేశాలు ఎలా జరుగుతాయి అనే సందేహం నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 7 నుంచి మొదలు కాబోతున్నాయి. కరోనా విజృంభిస్తున్న కారణంగా ఇప్పటికే ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ 19 ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటిస్తూ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

పంజాబ్ రాష్ట్రంలో ఒక్క రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరుకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారికే మత్రమే సమావేశాల్లో పాల్గొనే ఆవకాశం ఇచ్చారు. ఇటు పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కూడా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సమావేశాల్లో పాల్గొనే పార్లమెంట్ సభ్యులు 72 గంటల ముందు కోవిడ్ 19 టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటు పార్లమెంట్ లో విధులు నిర్వహించే వారికి కూడా సమావేశాల కంటే ముందు కోవిడ్ 19 టెస్టు చేయించుకోవాలని సూచిస్తారని తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ 15 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కరోనా కారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఇప్పడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్చువల్ సెషన్ నిర్వహించాలని కోరింది. ఇప్పటి వరకు 10మందికి పైగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి రికవరీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు అంటే భారీగా పోలీసు సిబ్బంది, సందర్శకులు రాకపోకలు ఉంటాయి. కరోనా నేపథ్యంలో సిబ్బంది వినియోగాన్ని భారీగా తగ్గిస్తారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... కోవిడ్ ప్రోటోకాల్ అమలుపై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: