జనసేన వార్నింగ్.. అయినా ఆగలేదు..
నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు నిందితుడుగా మారాడు. దీంతో వ్యవహారం మరింత హాట్ గా మారింది. పవన్ కల్యాణ్ కి పరాన్నజీవి సినిమాకి సంబంధం లేకపోయినా పవన్ వీరాభిమాని కావడం వల్లే నూతన్ నాయుడు వర్మపై పగ తీర్చుకున్నాడనే విషయం వాస్తవం. అయితే ఇప్పుడు నూతన్ నాయుడు, అతని భార్య నిందితులుగా మారడం పవన్ కి కూడా పరోక్షంగా ఇబ్బందిగా మారింది. అందులోనూ ఓ దళిత యువకుడికి గుండు గీయించడం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో సంచలనంగా మారింది.
దీంతో జనసేన నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. నూతన్ నాయుడితో జనసేనకు సంబంధం లేదు, మాపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడు పవన్ కల్యాణ్ అభిమాని అయినంత మాత్రాన ఇటువంటి సంఘటనల్లో ఆయన పేరు తీసుకురావొద్దని జనసేన పేరుతో ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ ప్రెస్ నోట్ తర్వాత వ్యవహారం మరింత ముదిరింది. ఎక్కడ ఏం జరిగినా బాధితుల పక్షాన బైటకొచ్చే జనసైనికులు ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మిగతా సందర్భాల్లో దళితులపై జరిగిన దాడులపై స్పందించిన టీడీపీ, జనసేన.. ఈ వ్యవహారంలో ఎందుకు న్యాయపోరాటం చేయడంలేదని, కనీసం బాధితుడిని ఎందుకు పరామర్శించలేదని మండిపడుతున్నారు. బాధితుడికి జరిగిన అవమానం గురించి ప్రస్తావించకుండా నూతన్ నాయుడుకి మాకు ఏ సంబంధం లేదు అని మాత్రమే చెప్పుకోడానికి జనసేన ప్రాధాన్యమిచ్చింది. దీంతో మరోసారి జనసేనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు.