మోడీతో కేసీఆర్ కయ్యం.. జగన్ నెయ్యం.. అసలు మతలబు ఏంటి..?
కరోనా అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ అని.. దానికి మేము కూడా ఏమీ చేయలేమంటూ బకాయిలు చెల్లించకుండా మొండికేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఈ కేంద్రమే ఆర్బీఐతో మాట్లాడి రాష్ట్రాలకు అప్పు ఇప్పించడం ఓ ఆప్షన్.. రాష్ట్రాలు అప్పులు చేస్తే కేంద్రం తీర్చడం మరో ఆప్షన్.. అయితే ఈ ఆప్షన్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు తలోదారి ఎంచుకుంటున్నాయి. తెలంగాణ సర్కారు ఈ విషయంలో కేంద్రం వైఖరిపై నిప్పులు చెరుగుతోంది.
అంతే కాదు.. అసలు కేంద్రంపై యుద్ధానికే సిద్ధం అంటూ తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు ధిక్కార స్వరం వినిపించారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే స్థాయిలో కేంద్రంపై విమర్శలు చేశారు. సాయం చేయాల్సిందిపోయి.. మొండిచేయి చూపిస్తారా.. అంటూ విమర్శల డోసు పెంచారు. మరోవైపు ఏపీ సర్కారు మాత్రం కేంద్రంతో ఘర్షణకు సిద్ధంగా లేదు. కేంద్రమే ఆర్బీఐతో మాట్లాడి అప్పు ఇప్పించే ఆప్షన్ను ఏపీ ఎంచుకుంటున్నట్టు ప్రకటించింది.
అయితే మరి ఈ తేడా ఎందుకు అని ఆలోచిస్తే.. తెలంగాణలో త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే దుబ్బాక అసెంబ్లీకి ఉపఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కాస్త ఘర్షణ వైఖరిలో వెళ్లడమే రాజకీయంగా మంచిదని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఎలా ముందుకు వెళ్తుంది.. కేంద్రంతో ఘర్షణతో ఏం సాధించనుంది అనేది వేచి చూడాలి.