కర్నూల్ లో బిస్కట్లు తిని చిన్నారులు మృతి చెందిన ఘటన గ్రామస్తులను కలచి వేస్తుంది.. అభం శుభం తెలియని వారు ఏం పాపం చేశారని మొగ్గలోనే వారి జీవితాలను దేవుడు తుంచి వేశారు. చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంలో కల్తీ కలిసిందా? షాపులో ఏదైనా జరిగింది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ కొట్టులో బిస్కట్లు తెచ్చుకొని తిన్న చిన్నారులు వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే ఒకరు చనిపోగా , ఇద్దరిని పరీక్ష చేస్తున్న వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే .. ఈ విషాద ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో ముగ్గురు చిన్నారులు ఓ కిరాణా షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని తిన్నారు. ఆ బిస్కెట్లు తిన్న వెంటనే ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఒకరు మృత్యువు ఒడిలోకి చేరగా, మరో ఇద్దరి పరిస్థితి ఏదని చెప్పలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ చిన్నారి చికిత్స పొందుతూ కన్ను మూశాడు..మరొకరికి కూడా వైద్యం అందిస్తున్న డాక్టర్లు 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమని అంటున్నారు.మృతులు హుస్సేన్ భాష, హుస్సేన్ బిగా గుర్తించారు. తల్లి దండ్రుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిస్కెట్లు షాప్ లోకి ఎక్కడి నుండి వచ్చాయి.. కొనుగోలు చేసిన తేదీ నుంచి అన్నీ వివరాలను పోలీసులు సేకరించారు. ఒకే ఊరిలో బిస్కట్లు తిని చనిపోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. పసిపిల్లల ఆహారంలో కూడా కల్తీ కలిపిన బిస్కట్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి పరువు నష్టం దావా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలను త్వరలోనే వెల్లిడిస్తామని పోలీసులు తెలిపారు.