మద్యం ఒక మంచి ఆదాయ వనరా...?

NAGARJUNA NAKKA
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మద్యం ఆదాయం ఆదుకుంటోందా..? ఏ శాఖ నుంచీ రాని ఆదాయం ఎక్సైజ్‌ నుంచి వస్తోందా?  అవును నిజమే..! కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు మందు డబ్బే కాస్తో కూస్తో ఆదుకుంటోందనేది అధికారవర్గాల మాట.
కరోనా కష్టాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లాడుతోంది. ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఖర్చులు లెక్కలు.. ఇవ్వాల్సిన జీతాల లెక్కలు ఆర్ధిక శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి? దీంతో పన్నులు, సెస్‌ రూపంలో ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 75 శాతం లిక్కర్‌ రేట్లు ఇప్పటికే పెరిగాయి. తాజాగా బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు... లైసెన్స్ ఛార్జీలపై కోవిడ్‌ ఫీజు వసూలు చేయాలని డిసైడ్‌ అయింది. ఇలా 16 వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్క కడుతోంది.
బార్ల లైసెన్స్‌ ఫీజ్‌, రెన్యూవల్‌ ఫీజ్‌ కింద సుమారు 113 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా..! అలాగే కోవిడ్‌ ఫీజు రూపంలో మరో 38 కోట్లు ఖజానాకు వచ్చి చేరనున్నాయి. ఇది కాకుండా.. పెంచిన పది శాతం అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ వల్ల 300 కోట్లు అదనంగా వస్తుందని భావిస్తున్నారు. అంటే సుమారు బార్ల ద్వారానే 471 కోట్లు రానుంది. ఇవి రెగ్యులర్‌ అమ్మకాలకు అదనం.
వాస్తవానికి 75 శాతం మేర మద్యం ధరలు పెంచితే.. గతంలో వినియోగం లెక్కల ప్రకారం ఏడాదికి 30 వేల కోట్ల రూపాయల రావాల్సి ఉంటుంది. అయితే మద్యం ధరలు భారీ స్థాయిలో పెంచడంతో వినియోగం తగ్గిన మాట వాస్తవమే. ఈ క్రమంలో ప్రభుత్వం అంచనా వేసుకున్న విధంగా 30 వేల కోట్ల రూపాయలు రాకున్నా.... 20 వేల కోట్ల మార్కు తాకుతుందని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది.  మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వ ఖజానా నిండుతోందని అభిప్రాయపడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: