ఆంక్షల్ని అతిక్రమిస్తే రూ.10లక్షలు జరిమానా..!

NAGARJUNA NAKKA
బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి రెండో దశ ప్రారంభమైంది. అక్కడ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షల్ని అతిక్రమిస్తే దాదాపుగా 10 లక్షల రూపాయలు వరకు జరిమానాలు విధించడానికి సిద్ధమైంది.

యూకే ప్రస్తుతం కరోనా వైరస్‌ రెండో దశ ఎదుర్కొంటోంది.  దీంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది.  వైరస్‌ని నియంత్రించాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం  ఉందన్నారు ఆ దేశ ప్రధాని బొరిస్ జాన్సన్. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌ 14 రోజుల నిబంధనల్ని అతిక్రమిస్తే వెయ్యి నుంచి 10  లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం లేని నిర్మాణ రంగంలో కార్మికులు, ఆదాయం కోల్పోయిన ఇతర వర్గాల వారికి 500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు. ఎప్పుడూ  ప్రయాణాలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కరోనా  నిబంధనల్ని పాటించడం లేదని మండిపడ్డారు. ప్రజలు కార్యాలయాలకు వెళ్లి పని చేయడం ప్రారంభించి కొన్ని వారాలు కూడా గడవకముందే   ప్రధాని మరోసారి వర్క్ ఫ్రం హోంను ప్రకటించారు.  బ్రిటన్ లో కోవిడ్  కొత్త నిబంధనలు సెప్టెంబర్‌ 28 నుంచి అమల్లోకి రానున్నాయి.

సాధ్యమైనంతవరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని బ్రిటన్ ప్రధాని అన్నారు.  పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్‌లపై కూడా త్వరలోనే కొత్త నిషేధాజ్ఞలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో కొత్త కేసుల పెరుగుదల రోజుకు 6వేల వరకు ఉండగా, ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్య కూడా ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతోందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా విషయంలో బ్రిటన్‌ చాలా దుర్భల స్థితిలో ఉందని ఆ దేశ అత్యున్నత వైద్య సలహాదారుడు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీ హెచ్చరించారు. సరైన చర్యలు చేపట్టకుంటే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతాయన్నారు. దీంతో బ్రిటన్ ప్రధాని కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: