ఐదు రోజులుగా తన పైన, తమ పార్టీ నాయకులపైనా, తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న ఏపీ మంత్రి కొడాలి నాని పైన, ఏపీ సీఎం జగన్ పైన టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ మంత్రులు బరితెగించి వ్యవహరిస్తున్నారని, బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజల పైన వైసిపి వేధింపులతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, దళితులపై దాడులు హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారని , ఇటువంటి పరిస్థితి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని బాబు మండిపడ్డారు. ప్రజలు, ప్రతిపక్షాలపై వైసిపి పోరాడుతోందని, సింహాచలం ఆలయం తో ప్రారంభమైన దేవాలయాల పై దాడి ఇప్పుడు తిరుమల వరకు వచ్చిందని, దేవాలయాల పట్ల అపచారాలు, అన్యమతస్తుల ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఘటనలు ఇప్పుడే చూస్తున్నాను అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనాతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఎక్కడ మాస్కు పెట్టుకోవడం లేదని, కానీ మస్కు పెట్టుకో లేదన్న కారణంతో చీరాలలో ఒక యువకుడిని చంపేశారని బాబు మండిపడ్డారు. మద్యం విషయంలో జగన్ ఇచ్చిన హామీలు ఏంటి ? నేడు ఆదాయం కోసం చీప్ లిక్కర్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, మద్యం విషయం లో నాలుగు వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని , ఇప్పుడేమో వ్యవసాయ బోర్లకు మీటర్లు అంటున్నారని, మీ మాటలను ప్రజలు నమ్మేది ఎలా అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పేరు ఎత్తకుండా బాబు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లపై కూడా మాట్లాడుకో లేని విధంగా ఓ మంత్రి బూతులు మాట్లాడుతున్నారని, రథాలు కాలిపోతే కొత్తవి తయారు చేస్తామని, వెండి సింహం బొమ్మలు పోతే కొత్తవి కొంటాం అని, ఆంజనేయ స్వామి బొమ్మ చేయి నరికితే ఆంజనేయస్వామికి వచ్చే నష్టం ఏమీ లేదని మాట్లాడడం బాధ కలిగించిందని చంద్రబాబు స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి పార్టీ నేతలతో చర్చించారు.