వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురు చూపులు..!

NAGARJUNA NAKKA
కోవిడ్ వ్యాక్సీన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. మరి అంత పెద్ద ఎత్తున వ్యాక్సీన్ తయారు చేయాలంటే వేల కోట్లు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని భరించే స్థితిలో భారత్ ఉందా..? కేంద్రానికి, సీరమ్ సంస్థ.. ఇదే ప్రశ్న వేసింది.

మహమ్మారిలా మారిన కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆ రేస్ లో భారత్ కూడా దూసుకెళుతోంది.భారత్ లోని కంపెనీలు... భారీస్థాయిలో వ్యాక్సీన్ ఉత్పత్తి చేసేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అయితే వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం అతి పెద్ద సవాలని... ఇప్పటికే చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది క్లిష్టమైన వ్యవహారంగా మారనుంది. దీన్ని ఉద్దేశించి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా కేంద్రాన్ని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి గానూ.. వచ్చే సంవత్సర కాలానికి కేంద్రం 80వేల కోట్ల రూపాయలను ఖర్చుచేయగలదా?అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వచ్చే ఏడాది కాలంలో భారత ప్రభుత్వానికి 80వేల కోట్లు లభిస్తాయా? భారత్‌లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ను అందించాలంటే దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి కేంద్రానికి అవసరమైన మొత్తమిది. మనం పరిష్కరించాల్సిన తదుపరి సవాలు ఇది అని అదర్‌ పూనా వాలా ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం కోసం సీరమ్ సంస్థ ఇప్పటికే ఆస్ట్రాజెనికా, నోవాగ్జిన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఆ రెండు వ్యాక్సిన్ లు ప్రయోగదశలోనే ఉన్నాయి.

మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. వచ్చే ఏడాది భారత్ కు 80వేల కోట్లు అవసరం కానున్నాయి. అంత మొత్తాన్ని భారత్ సిద్ధం చేయగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: