ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో మార్పులు..!
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ2020పై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఉన్నత విద్యలో ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. వచ్చే మూడేళ్లలో అన్ని కాలేజీలు పూర్తి స్థాయిలో ప్రమాణాలు సాధించాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. ఎన్ఏసీ, ఎన్ బీఏ అక్రిడిటేషన్ కూడా కాలేజీలు పొందాల్సి ఉంటుంది. కాలేజీల్లో రెగ్యులర్‌గా తనిఖీల కోసం 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేస్తారు. ప్రమాణాలు పాటించని కాలేజీలకు ముందు నోటీసులు ఇస్తారు. అప్పటికీ మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసివేయాలని సీఎం జగన్ ఆదేశారు.
అటు ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్ టాపిక్స్‌తో కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక నుంచి ఏడాది లేక రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు ఉండనున్నాయి. మూడు లేక నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు, నాలుగేళ్ళ డిగ్రీ చేసిన వారికి నేరుగా పీహెచ్‌డిలో ప్రవేశం వంటి అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అదే విధంగా వచ్చే ఏడాది నుంచి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌కు కూడా విద్యా శాఖ రూపకల్పన చేస్తోంది.
అడ్వాన్స్‌డ్ కోర్సులకు రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రొబొటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా అనలెటిక్స్ వంటి కొత్త కోర్సులు, బికామ్‌లో సెక్యూరిటీ అనాలిసిస్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలు కూడా ఉండే విధంగా మార్పులు చేయనున్నారు..
జాతీయ అక్రిడిటేషన్ సంస్థలకు అనుబంధంగా రాష్ట్రంలో కూడా అక్రిడిటేషన్ విభాగాన్ని తయారు చేస్తారు. విద్యా సంస్థలన్నింటినీ దీని పరిధి కిందకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. విజయనగరంలో ఇంజనీరింగ్ విద్య ఫోకస్‌గా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ, టీచర్ ఎడ్యుకేషన్ ఫోకస్‌గా ఒంగోలులో యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.